Welcome To Nijam News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alerts in Telugu Language at nijamnews.in

ఫిరాయింపులను నిరోధించలేని చట్టం

ఫిరాయింపులను నిరోధించలేని చట్టం

నీరుగారుతున్న పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం

ఓటుకు నోటుతో నైతిక విలువలు పతనం

ఇదీ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి. చట్టాలు ఎన్ని ఉన్నా అవి ప్రజలకు చెప్పడానికే కానీ నాయకులు పాటించడానికి కాదు. ఇక ప్రజల పరిస్థితి చెప్పనక్కరలేదు.కరెన్సీ నోటుకు విలువైన తమ ఓటు అమ్ముకొని తప్పు జరిగినా అడిగే హక్కు లేక మరో ఎన్నికల వ్యాపారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతిపక్షాలు కూడా నోరు మెడపడంలేదు అంటే పరిస్థితి ఎలా ఉంది అర్ధమవుతుంది. ఫిరాయింపులు ప్రతిపక్ష, అధికార పక్షాలు ఇరువురికి అవసరమే.
తెలంగాణ రాష్ట్రంలో 2018 శాసనసభ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం అధికార పార్టీ విజయపథంలో దూసుకుపోయింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం అధికార పార్టీకి ఎదురుగాలి వీచింది. ఇక గెలిచిన లీడర్లు అంతా తమను గెలిపించిన ప్రజలకు, పార్టీకి విధేయులై ఉంటారని అనుకున్నారు. కొన్నిరోజులు విధేయత డ్రామా బాగానే నడిచింది. ఇక ఆతర్వాత ఎప్పుడెప్పుడు అధికార పార్టీలోకి వెల్దామా అనే ఎదురుచూపులు ఎక్కువయ్యాయి. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలోనే ఉండాలి అనే కుటిల రాజకీయ ఎత్తుగడను ప్రజల ముందుకు తెచ్చి మెల్లగా తమ అడుగులు అధికార పార్టీలోకి పరుగులు పెట్టించారు సదరు నాయకులు. ఏ పార్టీలో ఉన్నాకూడా అధికార పార్టీ తో సంబంధం లేకుండా అభివృద్ధి వైపు మీతో కలిసి ప్రయాణం చేస్తామని గెలిచిన తర్వాత పార్టీ ఫిరాయింపులకు పాల్పడడం ఏరు దాటాక తెప్ప తగలబెట్టినట్టుగా ఉంది. అయితే ఈ విషయం ప్రజలకు గుర్తుంది అన్న విషయం నాయకులు మర్చిపోయినట్టున్నారు. ప్రజల ఓటుకు ఎంతమాత్రం విలువలేదని ఈ దేశంలోని ఏ చట్టమూ తమను శిక్షించలేదని ప్రజలు కూడా కొన్నిరోజులలో మర్చిపోతారని అనధికారికంగా ప్రకటించేశారు…

పార్టీ ఫిరాయింపులపై ఎవరూ నోరు మెదపకున్నా గిరిజన ప్రాంతానికి చెందిన గంగాధర కిశోర్ కుమార్ అనే సామాన్య యువకుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్ కి ఫిర్యాదు చేశాడు. పార్టీ ఫిరాయిపులు ప్రోత్సహించదగినవి కావని, ఓటర్ల మనోభావాలు, నమ్మకాలు తుంగలోతొక్కి పార్టీ మారడం ఎంతమాత్రం ఆమోదయోగ్యమైన పని కాదని పార్టీ మారిన ఎమ్మెల్యేల వివరాలతో స్పీకర్ కు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు కాపీలను భారత రాష్ట్రపతి కార్యాలయానికి, ఉపరాష్ట్రపతి కార్యాలయానికి, భారత ప్రధానికి, సూప్రీమ్ కోర్ట్ మరియు తెలంగాణ హైకోర్టు కు, తెలంగాణ రాష్ట్ర గవర్నర్ కి రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించాడు. సోషల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీ, కేటీఆర్ సహా ప్రముఖులందరికి ట్వీట్ చేసాడు, నేషనల్ మీడియాలకు కూడా ట్విటర్ ద్వారా ఫిర్యాదు విషయం తెలియచేశాడు. అయితే చట్టంలోని ఉన్న లోపాలు అతిముఖ్యమైన విషయాలను కూడా నీరుగారుస్థాయి. పార్టీ ఫిరాయింపుల చట్టంపై వచ్చిన ఫిర్యాదుల విషయమై స్పందించదానికి సమయం నిర్దేశించకపోవడం, స్పీకర్ కి ఉన్న విచక్షణాధికారం ఈ ఫిర్యాదును పక్కన పెట్టేలా చేసింది. పార్టీలు మారడం వల్ల రాజకీయాల్లో నైతిక విలువల పతనానికి దారితీస్తాయి. ఎన్నికలంటే ప్రజల్లో నిరాసక్తత పెరుగుతుంది. ప్రజాస్వామ్య విలువలు మట్టిగొట్టుకుపోతాయి. నాయకుల్లో జవాబుదారీతనం కొరవడుతుంది. అందుకే 1985 సంవత్సరం లో 52 వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగం లోని 10వ షెడ్యూలు లో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చేర్చబడింది.

ALSO READ: మొన్న కాంగ్రెస్ – నిన్న తెరాస – నేడు కాంగ్రెస్

కానీ చట్టం అమలులోకి వచ్చి 36 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ చట్టం తన ప్రభావాన్ని చూపలేకపోయింది. అందుకు కారణం ప్రతి రాష్ట్రం, ప్రతి రాజకీయ పార్టీ కూడా పార్టీ ఫిరాయిపులను తెర వెనుకగా ప్రోత్సాహించడమే. ఇది బహిరంగ రహస్యం. అంతిమ నిర్ణయం సభపతులకు వదిలిపెట్టడం అనే చట్టంలోని అతి ముఖ్యమైన లోపం వల్ల చట్టం యొక్క ఉద్దేశం నెరవేరడంలేదు. ఇలాంటి లొసుగులవల్ల ఈ చట్టం శిక్షించడానికి కాకుండా అవినీతి రాజకీయ నాయకులను రక్షించడానికి ఉపయోగపడుతుంది.
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం తీసుకొనే నిర్ణయాల్లో కోర్టుల పాత్రను చట్ట ప్రకారమే నిరోధించడం జరిగింది. ఈ చట్టం అమలుకు కోర్టుల ప్రమేయం ప్రస్తుతానికి ఏమి లేదు. అయితే ఈ దేశంలో రూపొందించబడిన ఏ చట్టాలని అయిన సమీక్షించే అధికారం, అవకాశం భారత సర్వోన్నత న్యాయస్థానానికి ఉందన్న విషయం ప్రస్తావనార్హం. ఈ విషయంలో 1993 వ సంవత్సరం కీమోట ఝలోహన్ వర్సెస్ జాచిలు కేసులో సభాధ్యక్ష్యుని నిర్ణయం అంతిమం కాదని అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని సూప్రీమ్ కోర్ట్ వారు వాఖ్యానించారు.అలాగే 2017 సంవత్సరం లో మాణిపూర్ రాష్ట్ర అసెంబ్లీ లో జరిగిన పార్టీ ఫిరాయిపులపై వచ్చిన ఫిర్యాదులపై సభాధ్యక్ష్యులు మూడు నెలల్లో తమ నిర్ణయాన్ని ప్రకటించాలని సూప్రీం కోర్టు స్పష్టం చేసింది.

ALSO READ: జులాయి’ సీన్ రిపీట్ చేశారు.. బ్యాంకునే దోచేశారు

ఫిరాయిపుల చట్టం అన్ని పార్టీలకూ గండం

తమ పార్టీని ఆసరాగా చేసుకుని గెలిచి ఆతర్వాత హాయిగా అధికార పార్టీలోకి మారిపోతుంటే మరి మాతృ పార్టీలు ఎం చేస్తున్నాయి అన్న అనుమానం రాకపోదు. అయితే ఏ పార్టీ కూడా నోరు మెడపడంలేదు. పార్టీ మారిన క్రొత్తల్లో కొన్నిరోజులు హంగామా చేసి ఆతర్వాత మిన్నకుండి పోవడానికి కారణం ఏమిటని ఆలోచిస్తే అధికార పార్టీతో లోపాయికార ఒప్పందాలు జరగడం వల్లనో లేదా తదుపరి ఎన్నికల తర్వాత ఫిరాయింపుల వల్ల ఉపయోగం ఉంటుందని కావాలనే మిన్నకుంటున్నారు. అందుకే ఫిరాయింపుల చట్టం కింద ఫిర్యాదు వచ్చినా దాన్ని తొక్కిపెట్టే విచక్షణాధికారం స్పీకర్లకు చట్ట ప్రకారమే కల్పించారు. దాని గురించి ఇక అడిగేవారే లేరు. చట్టంలో ఉన్న ప్రధాన లోపం ఇది. అందుకే ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఓటర్లు సరైన నిర్ణయాన్ని తీసుకోవాలి.పార్టీ ఫిరాయిపులపై రాష్ట్రంలోని ప్రతి పౌరుడు ప్రశ్నించాలి. లేకపోతే రాజకీయాల్లో అస్థిరత పెరుగుతుంది. అవినీతి అక్రమార్జనే ధ్వేయంగా ప్రస్తుత రాజకీయాలు నడుపుతున్నారనే భావన ప్రజల్లో బలంగా ఉంది. దీనికి తగినట్టుగానే ప్రస్తుత పరిస్థితులు కూడా ఉన్నాయి. రాజకీయాల్లో అవినీతిని ప్రశ్నించనంతకాలం పరిస్థితిలు ఇలాగే ఉంటాయి.అడిగేవారు లేకుంటే అవినీతికి మనమే అవకాశం ఇచ్చినవాళ్ళమవుతాము. కాబట్టి ప్రతి పౌరుడు అవినీతిని ప్రశ్నించడానికి ధైర్యంగా ముందుకు రావాలి. డబ్బు తీసుకుని ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఒక్క క్షణం తమ భవిష్యత్ గురించి ఆలోచించడం మంచిది.